ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు..
- రఘునాథ్ వెరబెల్లి
దండేపల్లి, ఆంధ్రప్రభ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, ఏకాగ్రతతో చదివినప్పుడే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. గురువారం దండేపల్లి మండలంలోని తాళ్లపేట, పాత మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ కిట్స్ బ్యాగులు, నోట్ బుక్స్, జామెట్రీ బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు గత 12 ఏళ్లుగా తనవంతు సహాయం చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రతిభ కనబరుస్తున్నారని అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీపథకం ద్వారా నిధులు కేటాయిస్తూ, పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు బందెల రవి గౌడ్, గోపతి రాజయ్య, పతిపాక సంతోష్, ఎంబడి సురేందర్, విజేందర్, నలిమెల మహేష్, దొమ్మటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
