విద్య కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ఐక్యంగా పోరాడాలి

రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల్లో ఏఐఎస్‌ఎఫ్ నాయకుల పిలుపు.. విద్యను వ్యాపార వస్తువుగా మార్చే ప్రయత్నాలను అడ్డుకోవాలన్న విజ్ఞప్తి

కర్నూలు, ఆంధ్రప్రభ: విద్యను కాషాయీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ దిశగా తీసుకెళ్తున్న విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) నాయకులు పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని టీజీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి విద్యా–వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా ‘జాతీయోద్యమం–వివిధ స్రవంతులు’ అనే అంశంపై సీపీఐ రాష్ట్ర నాయకుడు చలసాని వెంకట రామారావు, ‘విప్లవకర పార్టీ ఆవశ్యకత–పార్టీ నిర్మాణం’ అంశంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె. రామాంజనేయులు బోధించారు.

వక్తలు మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విద్యార్థి శక్తిని సమీకరించి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ఏకైక విద్యార్థి సంఘంగా ఏఐఎస్‌ఎఫ్ చరిత్రలో నిలిచిందన్నారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించాలనే లక్ష్యంతో విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేసిన ఘనత ఏఐఎస్‌ఎఫ్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగాన్ని కాషాయీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ వైపు మళ్లిస్తున్నాయని ఆరోపించారు. విద్యను వ్యాపార వస్తువుగా మార్చే ప్రయత్నాలను అడ్డుకునేందుకు విద్యార్థులు సంఘటితంగా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజులు, పుస్తకాలు, ఇతర రుసుముల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై భారీ ఆర్థిక భారం మోపుతున్నాయని విమర్శించారు. విద్యా రంగంలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

నాలుగు రోజుల శిక్షణ శిబిరంలో నిపుణులు బోధిస్తున్న అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, రాష్ట్రంలో నెలకొన్న విద్యా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు, రాష్ట్ర కార్యదర్శి నాసర్ జీ, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు సాబీర్, ఫణీంద్ర, మస్తాన్, కుళ్లాయిస్వామి, సాయికుమార్, నాగభూషణం, చలపతి, రాష్ట్ర గర్ల్స్ కో-కన్వీనర్లు యామిని, షణ్ముఖప్రియ, కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమన్న, జిల్లా నాయకులు రంగసామి, శరత్, వీరేష్, అశోక్, అభి తదితరులు పాల్గొన్నారు.