ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారామ్ పిలుపు

క్యాంపస్‌లో విద్యా ప్రమాణాలు, వసతుల పరిశీలన..
అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వ సంక్షేమం అందేలా చర్యలు తీసుకోవాలని సూచన

ఎచ్చెర్ల, ఆంధ్రప్రభ : ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారామ్ పిలుపునిచ్చారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) క్యాంపస్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా అణగారిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

క్యాంపస్‌లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు, వసతులు, వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంతకుముందు క్యాంపస్‌కు విచ్చేసిన రావాడ సీతారామ్‌కు విశ్వవిద్యాలయ డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్ శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం విద్యార్థుల హాస్టళ్లు, మెస్, గ్రంథాలయం, తరగతి గదులను పరిశీలించిన ఆయన, క్యాంపస్‌లో విద్యార్థులకు ఎలాంటి వివక్ష లేదా ఇబ్బందులు తలెత్తకుండా యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఉన్నత ఉద్యోగాల సాధన కోసం ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించాలని విశ్వవిద్యాలయ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పరిపాలనా అధికారి డాక్టర్ శివ రామకృష్ణ, డీన్ శాస్త్రి, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వాసు, డాక్టర్ ముని రామకృష్ణ, వెల్ఫేర్ డీన్లు డాక్టర్ ప్రకాష్ రావు, డాక్టర్ యోగేశ్వరి, అధ్యాపకులు పాల్గొన్నారు.