Coolphabets : భాషకు ఏఐ అండ Andhra Prabha Top Story

Coolphabets : భాషకు ఏఐ అండ Andhra Prabha Top Story

  • భావితరాలకు ‘కూల్ఫాబెట్స్’ బాట!
  • పిల్లలు ఆడుతూ.. పాడుతూ.. రాస్తూ…..
  • తమ మాతృభాష నేర్చుకునేలా…
  • 10 ఏళ్ల పరిశోధనకు సాకార రూపం…
  • ఎన్నారై రంజిత్ కొల్లు వినూత్న సృష్టి
  • ప్రపంచ స్థాయి భాషా అభ్యాస వేదిక..
  • ఏఐతో అక్షర రాతకు మూల్యాంకనం….
  • ‘భాషే మన గుర్తింపు..
  • రాతే మేధస్సుకు పునాది
  • సంస్కృతిని కాపాడేది మాతృభాషే
  • ఆంధ్రప్రభతో రంజిత్ కొల్లు

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో )

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సహా భారతీయ భాషల పరిరక్షణే లక్ష్యం
డిజిటల్ యుగంలో పిల్లలు మొబైల్‌కు దూరం కావడం అసాధ్యమైతే… అదే మొబైల్‌ను మాతృభాషకు గురువుగా మార్చాలనే వినూత్న ఆలోచనకు అమెరికాలోని తెలుగు ఎన్నారై రంజిత్ కొల్లు రూపం ఇచ్చారు. పదేళ్లపాటు సాంకేతిక పరిణామాల కోసం ఓపికగా ఎదురుచూసి, కృత్రిమ మేధ (ఏఐ) శక్తిని భాషా బోధనతో మేళవిస్తూ ‘కూల్ఫాబెట్స్’ పేరుతో ప్రపంచంలోనే అరుదైన భాషాభ్యాస వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. పిల్లలు అక్షరాన్ని రాయడం నుంచి ఉచ్చారణ, పదాలు, వాక్యాలు, ఆటల ద్వారా నేర్చుకునేలా రూపొందించిన ఈ యాప్ భాషాభ్యాసంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది.

Coolphabets : ఇష్టంతో చదువుకునేలా…..

పిల్లలు భాషను చదవడం కాదు… ప్రేమించాలి. నేర్చుకోవడం కాదు… ఆస్వాదించాలి ఇదే ఆలోచనతో అమెరికాలో స్థిరపడిన తెలుగు ఎన్నారై రంజిత్ కొల్లు పదేళ్ల క్రితం ప్రారంభించిన ప్రయాణం నేడు ‘కూల్ఫాబెట్స్’ రూపంలో సాకారమైంది. తన చిన్ననాటి స్నేహితుడు, ఐఐఎం పట్టభద్రుడు వెంకట్‌తో కలిసి 2016లో మొదలైన ఈ ప్రయాణం సాంకేతిక పరిమితుల కారణంగా ఆలస్యమైనా, నేటి ఏఐ యుగంలో ప్రపంచ స్థాయి భాషాభ్యాస వేదికగా అవతరించింది.

Coolphabets : అన్ని అక్షరాల మేళవింపుతో…

ప్రారంభంలో విజువల్ లెర్నింగ్ కాన్సెప్ట్‌తో రోజువారీ ఉపయోగించే వస్తువులపై అక్షరాలను ముద్రించి పిల్లలకు సహజంగా భాషను పరిచయం చేయాలని భావించారు. అయితే అమెరికాలో తమ పిల్లలు సంప్రదాయ భాషా తరగతులపై ఆసక్తి చూపకపోవడంతో పూర్తిస్థాయి డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాలని నిర్ణయించారు.

Coolphabets : ఏఐతో అక్షరానికి మార్కులు……

ఈ యాప్‌లో పిల్లలు రాసిన ప్రతి అక్షరాన్ని కృత్రిమ మేధ విశ్లేషిస్తుంది. సరైన విధంగా ఆరు సార్లు రాస్తేనే తదుపరి అక్షరానికి అనుమతి ఉంటుంది. దీంతో పిల్లల్లో అక్షర నిర్మాణం, రాత నైపుణ్యం సహజంగానే పెరుగుతుందని రంజిత్ తెలిపారు. ఒక్కసారి భాషను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్నెట్ అవసరం లేకుండానే యాప్ పనిచేయడం దీని మరో విశేషం. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా నిరంతరంగా భాషాభ్యాసం కొనసాగించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.

Coolphabets : 45 గేమ్స్… తల్లిదండ్రుల స్వరమే గురువు..

ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్ లో అక్షరాలు, పదాలు, వాక్యాల అభ్యాసానికి ప్రత్యేకంగా రూపొందించిన 45 ఇంటరాక్టివ్ గేమ్స్ పిల్లలను ఆటలోనే భాష వైపు తీసుకెళ్తాయి. తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు తమ స్వరాన్ని రికార్డు చేసి పిల్లలకు వినిపించే అవకాశం కూడా కల్పించారు. కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో భాషా అభ్యాసం మరింత ఆప్యాయంగా మారుతుందని ఆయన చెప్పారు.

Coolphabets : తల్లిదండ్రుల అరచేతిలో…

పిల్లలు ఏ అక్షరం వద్ద ఇబ్బంది పడుతున్నారో, ఎంత సమయం సాధన చేస్తున్నారో, ఎంత పురోగతి సాధించారో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సులభంగా తెలుసుకునే ప్రత్యేక ట్రాకింగ్ వ్యవస్థను యాప్‌లో ఏర్పాటు చేశారు. రాయడం అనేది కేవలం అక్షరాలను నేర్చుకోవడం మాత్రమే కాదు. పిల్లల్లో జ్ఞాపకశక్తి, మోటార్ స్కిల్స్, మెదడు వికాసానికి అది బలమైన పునాది. మాతృభాషపై లోతైన పట్టు కూడా రాత ద్వారానే వస్తుంది. భాష నిలిస్తే సంస్కృతి నిలుస్తుంది. భాషే మన వ్యక్తిత్వం” అని రంజిత్ స్పష్టం చేశారు.

Coolphabets : భవిష్యత్తుకు రెండు ఫీచర్లు..

ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ అమలు చేయని రెండు అత్యాధునిక ఫీచర్లపై ప్రస్తుతం పని చేస్తున్నామని, వాటిలో ఒకటి విజయవంతమైతే భాషాభ్యాస రంగంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతుందని రంజిత్ వెల్లడించారు. అయితే వాటి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని చెప్పారు.

Coolphabets : స్కూల్‌కు ప్రత్యామ్నాయంగా కాదు…..

ఈ యాప్ పాఠశాలలను భర్తీ చేసేందుకు కాదని, స్కూల్‌లో నేర్చుకున్న భాషను ఇంట్లో సరదాగా సాధన చేసేందుకు ఉపయోగపడే సహాయక వేదిక మాత్రమేనని రంజిత్ వివరించారు. పిల్లలు మొబైల్‌లో గడిపే సమయాన్ని విద్యగా మలచడమే తమ లక్ష్యమన్నారు. మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ‘కూల్‌ఫాబెట్స్’ను భవిష్యత్తులో తెలుగు మాత్రమే కాకుండా ఇతర భారతీయ, విదేశీ భాషలకు కూడా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రంజిత్ తెలిపారు. భావితరాలు ప్రపంచ పౌరులైనా… తమ మాతృభాషపై గర్వపడాలి. అదే మా ప్రయాణానికి అసలు ప్రేరణ” అని కొల్లు రంజిత్ ఆంధ్ర ప్రభకు వివరించారు.