ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం..
కౌకుంట్లలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా దర్బార్
అర్జీలు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి..
త్వరిత పరిష్కారానికి హామీ
ఉరవకొండ, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గురువారం ఉరవకొండ నియోజకవర్గంలోని కౌకుంట్ల గ్రామంలో తన స్వగృహంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి మాట్లాడి వారి సమస్యలు, వినతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ప్రజల నుంచి అందిన అర్జీలను పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
