ఎస్‌ఐఆర్ ఓటర్ సర్వేకు ప్రజలందరూ సహకరించాలి
కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలంలోని కన్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చిన్న క్యాంపు గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ఓటర్ సర్వేకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని కన్నాపూర్ సర్పంచ్ ఎం. శంకర్ కోరారు. జీపీఓ డి. నరసయ్య, పంచాయతీ కార్యదర్శి రిజ్వానా, వార్డు సభ్యుడు శేఖర్ గౌడ్, బీఎల్‌ఓ జి. హైమావతితో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు సర్వే ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవడంతో పాటు అవసరమైన పత్రాలను స్థానిక బీఎల్‌ఓకు అందజేసి సర్వేను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటరు జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. బీఎల్‌ఓ హైమావతి ఎస్‌ఐఆర్ ఫారాలు నింపే విధానం, అవసరమైన ధ్రువపత్రాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించగా, గ్రామ ప్రజలు సర్వేకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
