ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : చదువును మధ్యలో నిలిపివేసిన వారు, ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలనుకునే వారు, గృహిణులు, యువత, వృద్ధులు తదితరులందరికీ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా దూరవిద్య విధానంలో ఎస్‌ఎస్‌సీ (10వ తరగతి), ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు గెజిటెడ్ హెచ్‌ఎం, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పసుపుల సాయన్న తెలిపారు.
గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్‌ఎస్‌సీ ప్రవేశానికి టీసీ లేదా రికార్డ్ షీట్, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, సంబంధిత పత్రాల రెండు సెట్ల జిరాక్స్ కాపీలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
ఇంటర్మీడియట్ ప్రవేశాలకు పదో తరగతి మెమో, టీసీ, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, అవసరమైన పత్రాల రెండు సెట్ల జిరాక్స్ కాపీలు సమర్పించాలని పేర్కొన్నారు.
అడ్మిషన్‌కు గరిష్ఠ వయోపరిమితి లేదని, 15 సంవత్సరాలు నిండిన ఎవరైనా ప్రవేశానికి అర్హులని తెలిపారు. ఉద్యోగులు, గృహిణులు, చదువు మధ్యలో మానేసిన వారు, ఇతర ఆసక్తిగల అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం గెజిటెడ్ హెచ్‌ఎం, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పసుపుల సాయన్నను 8790465456 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
