ఎడపల్లి మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలన
ఎడపల్లి, ఆంధ్రప్రభ ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని గురువారం మండల తహసీల్దార్ దత్తాత్రి పరిశీలించారు. పోలింగ్ బూత్‌లో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమీక్షించి, బూత్ స్థాయి అధికారులకు అవసరమైన సూచనలు అందించారు.
ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హ ఓటరు తమ వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, అవసరమైన సవరణలు, మార్పులు, చేర్పులు చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు. ఓటరు జాబితా ఖచ్చితత్వం, పారదర్శకత పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ మాట్లాడుతూ, బోగస్ ఓటర్లను గుర్తించి తొలగించడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడమే ఎస్ఐఆర్ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. ప్రజలు అపోహలకు లోనవకుండా అవసరమైన పత్రాలతో బీఎల్వోలను సంప్రదించి తమ ఓటరు వివరాలను ధృవీకరించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వినోద్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
