బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది..
బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది..
- జిల్లా కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రంలోని దాస్నాపూర్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు.
ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో, ప్రమాదంలో పూర్తిగా నష్టపోయిన రెండు కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ.95,100 చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు పేర్కొన్నారు.
అలాగే పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న మరో కుటుంబానికి రూ.9 వేల ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు తెలిపారు.
అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ)ను ఆదేశించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయక చర్యలు కొనసాగుతాయని, ప్రభుత్వం వారి పునరావాసానికి అండగా నిలుస్తుందని కలెక్టర్ హరిత తెలిపారు.
