గ్రామాలు బలపడితేనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారం

వీబీజీ రామ్‌జీతో గ్రామీణాభివృద్ధికి కొత్త దిశ
గ్రామీణ భారతానికి కొత్త యుగానికి నాంది
గ్రామాలు ఆత్మనిర్భర్‌గా మారితేనే దేశం అభివృద్ధి
కేంద్ర మంత్రి కమలేష్ పాశ్వాన్
పవన్ కళ్యాణ్ ప్రజాసేవను కొనియాడిన కేంద్ర మంత్రి

తిరుపతి, ఆంద్ర‌ప్ర‌భ : గ్రామీణాభివృద్ధితోనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని కేంద్ర మంత్రి కమలేష్ పాశ్వాన్ అన్నారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లెలో నిర్వహించిన వీబీజీ రామ్‌జీ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈ పవిత్ర నేలపై ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. దేశంలోని కోట్లాది మంది శ్రామికులు తమ కృషితో అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీల నిర్మాణంలో భాగస్వాములై వికసిత్ భారత్ లక్ష్య సాధనకు తోడ్పడతారనే పూర్తి విశ్వాసం తనకు ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ తాను కూడా ఆయన అభిమానినేనని తెలిపారు. ఆయన నటించిన అనేక సినిమాలను చూసినట్లు పేర్కొన్నారు. సినీ రంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ, తన స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి పేదల కోసం, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ప్రజల కోసం పనిచేయాలనే సంకల్పంతో ప్రజా జీవితాన్ని ఎంచుకోవడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమం కేవలం ఒక కొత్త పథకం ప్రారంభం మాత్రమే కాదని, గ్రామీణ భారతదేశంలో కొత్త యుగానికి నాంది పలికే సందర్భంగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ అనే మహత్తర లక్ష్యాన్ని సాధించాలంటే గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే దేశ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామాలు బలపడితేనే దేశం బలపడుతుందని, గ్రామాలు ఆత్మనిర్భర్‌గా మారితేనే భారత్ ఆత్మనిర్భర్‌గా ఎదుగుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గ్రామాలు అన్ని రంగాల్లో సుసంపన్నంగా అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ స్వప్నం సాకారమవుతుందని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, స్వయం సమృద్ధి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఈ పవిత్ర భూమి నుంచే వీబీజీ రామ్‌జీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోందని కమలేష్ పాశ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.