వలస కార్మికులకు అండగా ఎమ్మెల్యే వసంత
- గడ్డమణుగు లోయలో క్వారీ కార్మికుల కుటుంబాలకు పరామర్శ
జి. కొండూరు. ఆంధ్రప్రభ: జి.కొండూరు మండలంలోని గడ్డమణుగు లోయలో నివసిస్తున్న వలస క్వారీ కార్మికుల కుటుంబాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం పరామర్శించారు. కార్మికులు నివసిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించిన వారు వారి జీవన పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఇబ్బందులను ఓపికగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు విన్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఇక్కడకు సమీపంలో గతంలో నిర్వహించిన కెమికల్ ఫ్యాక్టరీ కారణంగా భూగర్భజలాలు కలుషితమయ్యాయని చెప్పారు. ఇళ్లపట్టాలు ఇవ్వాలని, తాగునీటి సదుపాయాలు కల్పించాలని కోరారు. బీపీఎల్ కింద ఉన్న తమకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
భూగర్భజలాల కలుషితం గురించి పీసీబీకి లేఖ రాస్తామని, తాగునీటి సమస్య నివారణకు ఆర్వో ప్లాంట్ నిర్మిస్తామన్నారు. అర్హులకు పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తామన్నారు. వారి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ.. వలస కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్మికులకు అవసరమైన తాగునీరు, విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం వంటి కనీస సౌకర్యాలను దశలవారీగా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్మికుల పిల్లల విద్య, ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. వలస కార్మికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అన్ని విధాలా సహకరిస్తామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), రెవెన్యూ అధికారులు, కూటమి కుటుంబ సభ్యులు, రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
