ఏరియా ఆసుపత్రి లో సైబర్ నేరాల పై అవగాహన

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ: రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల ఆధ్వర్యంలో సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమంనిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్‌ఐ జాడి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. ప్రస్తుతం సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, ఆధార్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని తెలిపారు.

అలాగే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలని, ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించే సమయంలో అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే నష్టపోయిన నగదును తిరిగి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మధుకర్, వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.