‘రెండు చుక్కలే.. పోలియోకు శాశ్వత రక్షణ’
పల్స్ పోలియో విజయవంతానికి అవగాహన ర్యాలీ.. ప్రతి చిన్నారికి చుక్కలు వేయించాలని డాక్టర్ శిరీష పిలుపు
బాపట్ల రూరల్, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ బాపట్ల మండలం వేదుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
వేదుళ్లపల్లి పీహెచ్సీ నుంచి పూల మార్కెట్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని పల్స్ పోలియోపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వేదుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ, అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేదుళ్లపల్లి పీహెచ్సీ పరిధిలోని అన్ని గ్రామపంచాయతీల్లో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
తల్లిదండ్రులు తమ చిన్నారులను సమీపంలోని పోలియో బూత్‌లకు తీసుకువచ్చి రెండు చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ డి. ప్రసాద్, పీహెచ్ఎన్ నాగమణి, సూపర్వైజర్లు రవిశంకర్, రెబెక్క, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
