ఆటోలపై డ్రైవర్ల పూర్తి వివరాలు..

వెదుళ్లపల్లి పోలీసుల వినూత్న చర్య

ప్రతి ఆటోకు సీరియల్ నంబర్, పోలీస్ వెరిఫికేషన్ స్టిక్కర్.. ప్రయాణికుల భద్రతకు కొత్త భరోసా

బాపట్ల రూరల్, ఆంధ్రప్రభ: ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి వెదుళ్లపల్లి పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఆటోకు సీరియల్ నంబర్ కేటాయించి, డ్రైవర్ పూర్తి వివరాలు, పోలీస్ వెరిఫికేషన్ సమాచారాన్ని ఆటోలపైనే ప్రదర్శించే విధానాన్ని అమలు చేశారు.

బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఆదేశాలు, డీఎస్పీ చంద్రమౌళి సూచనలు, బాపట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ పర్యవేక్షణలో వెదుళ్లపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు స్థానిక ఆటోస్టాండ్‌లో ఆటోలకు సీరియల్ నంబర్ స్టిక్కర్లను అందజేసి అతికించారు.

ఈ సందర్భంగా ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రతి ఆటోపై సీరియల్ నంబర్‌తో పాటు డ్రైవర్ ఫొటో, పేరు, ఫోన్ నంబర్, పోలీస్ వెరిఫికేషన్ వివరాలు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ విధానం వల్ల ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు మరింత భద్రతతో ప్రయాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే లైసెన్స్ లేని వ్యక్తులు, నేర చరిత్ర ఉన్నవారు లేదా అనధికారికంగా ఆటోలు నడిపే వారిపై సమర్థవంతంగా నియంత్రణ సాధించవచ్చన్నారు.

ప్రయాణికులు ఆటోలో బ్యాగులు లేదా విలువైన వస్తువులు మరిచిపోయిన సందర్భంలో, ఆటో సీరియల్ నంబర్ లేదా డ్రైవర్ వివరాల ఆధారంగా వాటిని సులభంగా గుర్తించి తిరిగి అందించే అవకాశం కూడా ఈ విధానంతో కలుగుతుందని తెలిపారు.

ప్రజల భద్రతతో పాటు నిజాయితీగా వృత్తి నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్లకు గుర్తింపు, గౌరవం పెరిగేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని పోలీసులు పేర్కొన్నారు. వెదుళ్లపల్లి పోలీసులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.