అపరిచితులు ఇచ్చే తినుబండారాలు తీసుకోవద్దు..

విద్యార్థులకు ఎస్పీ హెచ్చరిక
డ్రగ్స్, గంజాయికి పూర్తిగా దూరంగా ఉండాలి..
అనుమానాస్పద సమాచారం 1972కు ఇవ్వాలని పిలుపు

ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఏపీ ఈగల్ ఎస్పీ కె. నగేష్ బాబు పిలుపునిచ్చారు. గుంటూరు ఏటి అగ్రహారంలోని ఎస్‌కేబీఎం మున్సిపల్ హైస్కూల్‌లో శనివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

1980–81 విద్యాసంవత్సరంలో ఇదే పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి ప్రస్తుతం ఎస్పీ స్థాయికి చేరుకున్న నగేష్ బాబు, తన పాఠశాల రోజుల అనుభవాలను, ఉపాధ్యాయుల బోధనలను గుర్తు చేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. తన ఎదుగుదలకు ఈ పాఠశాలలో నేర్చుకున్న క్రమశిక్షణ, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వమే పునాదిగా నిలిచిందని పేర్కొన్నారు.

అపరిచితులు ఇచ్చే చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, ఇతర ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించవద్దని విద్యార్థులకు సూచించారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి తెలియక డ్రగ్స్ కలిపిన చాక్లెట్లు తిని వ్యసనానికి గురై చివరకు పునరావాస కేంద్రంలో చేరాల్సి వచ్చిన ఘటనను ఉదాహరణగా వివరించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సమాజంలో గంజాయి, డ్రగ్స్ వంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఏపీ ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పూర్వ విద్యార్థుల తరఫున మెరిట్ స్కాలర్‌షిప్‌లను ఎస్పీ కె. నగేష్ బాబు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా కూడా సేవలందించిన అనుభవం ఉన్న నగేష్ బాబు చేసిన సూచనలు విద్యార్థుల్లో అవగాహన పెంచాయి.