డీటీఓ మృతి ఘటనపై సింగరేణి క్లారిటీ..

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: భూపాలపల్లిలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా రవాణా అధికారి (డీటీఓ) మృతి చెందడం విషాదకరమని సింగరేణి భూపాలపల్లి ఏరియా యాజమాన్యం పేర్కొంది. అయితే, ఈ ప్రమాదానికి సింగరేణి సంస్థకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.

ప్రమాదానికి కారణమైన లారీ( TS22T 2687 నంబర్) తాడిచెర్ల నుంచి చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ–జెన్‌కో)కు బొగ్గు రవాణా చేస్తోందని, ఆ వాహనానికి సింగరేణి సంస్థ కార్యకలాపాలు, సిబ్బంది లేదా రవాణా వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.

సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ భద్రతా ప్రమాణాలు, నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తోందని పేర్కొంది. ఈ విషాద ఘటనను సింగరేణితో ముడిపెట్టి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం ఖండనీయమని తెలిపింది. ప్రజలు, మీడియా ప్రతినిధులు ధ్రువీకరించిన సమాచారాన్నే విశ్వసించాలని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.