పిడుగు.. ఓ కుటుంబంలో చీకట్లు నింపింది
చిట్యాల, ఆంధ్రప్రభ: నలగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో పిడుగపాటుకు గురై ఓ గొర్రెల కాపరి మృతి చెందారు. సంకబుడ్డి నాగరాజు యాదవ్ (గొర్రెల కాపరి) వట్టిమర్తి గ్రామ శివారులో గొర్రెలు మేపుతుండగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగు పడటంతో నాగరాజు యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
నాగరాజు యాదవ్కు భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న నాగరాజు ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన గ్రామస్తులు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించాలని కోరారు.
