ఉన్నవ గ్రామంలో విషాదం

చెరువులో పడి యువకుడు మృతి..

యడ్లపాడు, ఆంధ్రప్రభ : చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ​మండల పరిధిలోని ఉన్నవ గ్రామం సూర్యనగర్ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రత్తిపాటి పాపారావు, ఏసమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో రెండో కుమారుడైన పత్తిపాటి చిన్న (22) రాడ్ బెండింగ్ పనులు చేస్తూ తల్లికి ఆసరాగా ఉంటున్నాడు.

అయితే, ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లిన చిన్న.రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. ​కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతుండగానే, సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో ఇంటి సమీపంలోని చెరువులో ఒక మృతదేహం తేలియాడుతుండటాన్ని స్థానికులు గమనించారు. గ్రామస్తులు వెంటనే చెరువులోకి దిగి మృతదేహాన్ని వెలుపలికి తీయగా, అది చిన్నగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.అప్పటికే యువకుడు మృతిచెంది ఉండటంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ​యువకుడి మృతికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.