అటవీ అధికార్ల జీపుపై రాళ్లతో దాడి..
అటవీ అధికార్ల జీపుపై రాళ్లతో దాడి..
- ఇసుక ట్రాక్టర్ దార్లపై అనుమానం..
- బేసు క్యాంపు మంచే పాక్షికంగా ధ్వంసం..
జన్నారం, ఆంధ్రప్రభ : పెట్రోలింగ్‌కు వెళ్లిన అటవీశాఖ అధికారుల జీపుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి, బేస్ క్యాంపు మంచెను పాక్షికంగా ధ్వంసం చేసిన ఘటన జన్నారం మండలంలో చోటుచేసుకుంది.
ప్రత్యక్ష సాక్షులైన జీపు డ్రైవర్, అటవీ అధికారుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లి, పుట్టిగూడ గ్రామాల సమీపంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ బృందంలో పైడిపల్లి బీట్ ఆఫీసర్ శ్రీకాంత్, రాయికుంట బీట్ ఆఫీసర్ మక్బూల్, తాళ్లపేట ఎండీ రహీమొద్దీన్, బేస్ క్యాంపు సిబ్బంది, జీపు డ్రైవర్ ఉన్నారు.

అటవీ అధికారుల రాకను గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు వారిపై అసభ్య పదజాలంతో దూషిస్తూ జీపుపై, సిబ్బందిపై రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం. అప్రమత్తమైన అటవీ సిబ్బంది, జీపు డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఘటనపై అటవీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అయితే అప్పటికే దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది.

ఈ దాడికి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు కారణమై ఉండొచ్చని అటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలోని బేస్ క్యాంపు మంచెను కూడా పాక్షికంగా ధ్వంసం చేసినట్లు తెలిపారు.
ఈ విషయమై జన్నారం ఇన్‌చార్జి రేంజ్ ఆఫీసర్ జి. వికాస్ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్‌ను సంప్రదించగా, అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.
