ఉపసర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ఉపసర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

  • ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉట్నూర్ మండల ఉపసర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడు, నాయకులు, ఉపసర్పంచులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

అనంతరం ఉపసర్పంచులు తమకు ఎదురవుతున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉపసర్పంచుల చెక్‌పవర్‌కు సంబంధించిన వార్తలపై తమ ఆందోళనలను వివరించారు. ప్రభుత్వం తరఫున ఉపసర్పంచుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి అధికారులు, సర్పంచులు, ఉపసర్పంచులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరి ఐక్యతతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఉపసర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచుల ఫోరం జిల్లా ఇన్‌చార్జి మొహమ్మద్ మోబిన్, ఉట్నూర్ మండల ఉపసర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడు వెడ్మ కొద్దు పటేల్, వివిధ గ్రామపంచాయతీల ఉపసర్పంచులు, కాంగ్రెస్ నాయకుడు అన్సారీ అలీ తదితరులు పాల్గొన్నారు.