ప్రజల ప్రశ్నలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం..

ప్రజల ప్రశ్నలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం..
ప్రభుత్వ పనితీరును ప్రశ్నించిన నిరంజన్ రెడ్డి
వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదివారం తన స్వగృహంలో పత్రికా సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లుతూ లేఖ రాసినట్లు తెలిపారు. అధికారులు ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలకు స్పందించాల్సిందిగా ఆయన సూచించారు. ప్రశ్నించే ప్రజలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు కాకపోతే ప్రజలు స్పందించడం వారి హక్కు అని పేర్కొన్నారు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు.
రైతులకు సకాలంలో కరెంట్, యూరియా సరఫరా చేయలేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసు రెండున్నర సంవత్సరాలు గడిచినా తేల్చకపోవడం ప్రభుత్వ అసమర్థత అని ఆయన ఆరోపించారు. వారం రోజుల్లో కేసు పురోగతి కనిపించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. మున్సిపల్ పాలనలో కూడా ప్రభుత్వం విఫలమైందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. పట్టణ పరిసరాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల దుర్వాసన వస్తోందని, రోడ్ల విస్తరణ పనులు పూర్తి కాలేదని అన్నారు. అన్ని వసతులతో నిర్మించిన టౌన్ హాల్ ఇప్పటికీ ప్రారంభించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
రామన్న గట్టు రిజర్వాయర్ పనులు నిలిచిపోవడం దురదృష్టకరమని, డీ–5, డీ–8 కాలువలను ఆధునీకరించడం ద్వారా సాగునీటి విస్తీర్ణం పెంచే అవకాశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం చేపట్టడం సరికాదని, స్కూల్ నిర్మాణానికి వ్యతిరేకం కాదని కానీ మెడికల్ కాలేజ్ ఆవరణలో కాకుండా వేరే ప్రదేశంలో స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే రాజపేట నుంచి పానగల్ రోడ్డును కలుపుతూ ప్రతిపాదించిన అర్ధచంద్రాకార బైపాస్ రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని కోరారు.
పెబ్బేర్ సంత స్థలం వివాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని ఆయన ఆరోపించారు. న్యాయస్థానాలు పలుమార్లు ప్రైవేటు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఈ సమావేశంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, లక్ష్మా రెడ్డి, ఎద్దుల కరుణశ్రీ, కృష్ణా నాయక్, రఘుపతి రెడ్డి, భీమన్న, కర్రె స్వామి, తిరుపతయ్య, మాణిక్యం, పెద్దింటి వెంకటేష్, దిలీప్ రెడ్డి, శివరాం రెడ్డి, గౌడ్ నాయక్, రాజశేఖర్, సూర్యవంశం గిరి, చంద్రశేఖర్, చిట్యాల రాము, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.
