స్వర్ణాంధ్ర 2047 సాధనే మన లక్ష్యం

స్వర్ణాంధ్ర 2047 సాధనే మన లక్ష్యం

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

చెరువులను పరిశుభ్రంగా మార్చుదాం.. చెత్త లేని సమాజాన్ని నిర్మిద్దాం : కలెక్టర్ శ్యాంప్రసాద్

ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రాణికోటికి ప్రమాదకరం : మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. చెరువు మరువ ప్రాంతంలో స్వచ్ఛత కార్యక్రమం చేపట్టి ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం, ముళ్లకంపలను తొలగించారు. చెరువులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని సందేశం ఇచ్చారు.

అనంతరం విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిశుభ్రమైన గ్రామాలు, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు ప్రతిజ్ఞ చేశారు.

ఓడీ చెరువు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛమైన, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, చెత్త నిర్వహణపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. చెరువులు, నీటి వనరుల పరిరక్షణ అందరి బాధ్యత అని తెలిపారు.

మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమికి, జలవనరులకు, ప్రాణికోటికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని అన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలు రైతులకు వరంగా మారుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీపీఓ సమత, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో శివప్రసాద్ రెడ్డి, అంజనప్ప, హెచ్‌ఎం శిరీష, ఎంఈఓలు సురేష్, రమణ, టీడీపీ మండల కన్వీనర్ జయచంద్ర, మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుల్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు తుమ్మల మహబూబ్ బాషా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నిజాం, శివారెడ్డి, కంచి సురేష్, మస్తానమ్మతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.