నందిగామలో భారీ చోరీ కేసు ఛేదన

నందిగామలో భారీ చోరీ కేసు ఛేదన

  • రూ.50 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
  • ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
  • నిందితుడిపై 130 వరకు కేసులు

నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ పట్టణంలో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.48.58 లక్షల విలువైన 347 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షల నగదు, హోండా యాక్టివా ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నందిగామకు చెందిన యర్రగడ్డ శ్రీనివాసరావు ఇంట్లో ఈ ఏడాది మే 25న చోరీ జరిగింది. ఈ ఘటనలో 347 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.6 లక్షల నగదు అపహరణకు గురయ్యాయి.

బాధితుడి ఫిర్యాదు మేరకు నందిగామ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ సీహెచ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషించి నిందితుల ఆచూకీ గుర్తించారు. ఈ నెల 18వ తేదీ రాత్రి నిర్వహించిన వాహన తనిఖీల్లో రాఠావత్ శంకర్ అలియాస్ శంకర్ నాయక్ (32), తేజసింగ్ అజయ్ (24) లను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో ప్రధాన నిందితుడు శంకర్ నాయక్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 120 నుంచి 130 వరకు చోరీ కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. మరో నిందితుడు అజయ్‌పై కూడా తెలంగాణలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో వీరు అంతర్రాష్ట్ర దొంగలుగా పోలీసులు భావిస్తున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సీఐ పి.శ్రీను, ఎస్సైలు కె.సూర్యవంశి, బి.మోహన్‌రావు మరియు పోలీసు సిబ్బందిని విజయవాడ పోలీస్ కమిషనర్ అభినందించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….

నందిగామ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాలనీలు, గ్రామాల్లో అనుమానాస్పదంగా సంచరించే కొత్త వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో భద్రతా చర్యలు పాటించాలని సూచించారు.