తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా భీమ్గల్ మండలం పిప్రి గ్రామంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరిగెల జనార్ధన్, ఉపసర్పంచ్ పతాని రంజిత్, గ్రామ కార్యదర్శి జితేందర్, వీడీసీ సభ్యుడు శ్రీనివాస్, వార్డు సభ్యులు మేఘన, అర్చన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవజాత శిశువుకు పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం అత్యంత అవసరమని తెలిపారు.
తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు రోగనిరోధక శక్తిని అందిస్తాయని, తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని సూచించారు. అనంతరం పోషకాహారంతో పాటు రెండేళ్ల వరకు తల్లిపాలను కొనసాగించాలని పేర్కొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతి కుటుంబం అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
