రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది
రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది
- పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా విస్మరిస్తూ రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బోనస్, పంట కొనుగోళ్లు, రైతు భరోసా, రైతు బీమా, యూరియా సరఫరా వంటి అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకుని రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
శనివారం నర్సంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో ఎంత వడ్లు పండించినా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కేంద్రం ఎంత కొనుగోలు చేస్తే అంతే కొంటామని చెప్పడం రైతులను దారుణంగా మోసం చేయడమేనని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కేంద్రం కొనుగోలు చేసినా, చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని పంటలను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో తన బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బోనస్ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. మొదట అన్ని పంటలకు, తరువాత వరికి, అనంతరం సన్నాలకే బోనస్ ఇస్తామని ప్రకటించి, 33 రకాల సన్నాల నుంచి కేవలం ఏడు రకాలకే బోనస్‌ను పరిమితం చేయడం వెనుక రైతులను మోసం చేసే కుట్ర ఉందని అన్నారు. ఈ నిర్ణయం వల్ల గత యాసంగి, ప్రస్తుత వానాకాలం కలిపి దాదాపు రూ.1,900 కోట్ల బోనస్ రైతులకు అందకుండా పోయిందని పేర్కొన్నారు. యూరియా సరఫరాలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు.
వరంగల్ జిల్లా, నర్సంపేట ప్రాంతంలో విస్తారంగా సాగుచేసే మిర్చి పంటకు అవసరమైన యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో రైతుబంధు, రైతు బీమా పథకాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో అమలయ్యాయని, ప్రస్తుతం రైతు భరోసా సక్రమంగా అందడం లేదని, రైతు బీమా చెల్లింపులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు.
“కొనుగోళ్లు ఖతం, రైతు భరోసా ఖతం, రైతు బీమా ఖతం, యూరియా ఖతం” అనే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని విమర్శించిన పెద్ది సుదర్శన్ రెడ్డి, రైతు వ్యతిరేక నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకుని అన్ని పంటలను యథావిధిగా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఆర్టీసీ రాష్ట్ర డైరెక్టర్, నియోజకవర్గ కోఆర్డినేటర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ఖనిజాభివృద్ధి డైరెక్టర్, నియోజకవర్గ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
