Terrible incident | ఇద్దరు పిల్లలను చంపి… ఆపై

Terrible incident | ఇద్దరు పిల్లలను చంపి…ఆపై
తండ్రి అనే మాటకే మచ్చ వేసిన కర్కశత్వం
పసిప్రాణాలు బలైన హృదయ విదారక ఘటన
Terrible incident | నారాయణపేట ప్రతినిధి (ఆంధ్రప్రభ) : తండ్రి ఒడిలో భద్రత కావాల్సిన పసిపిల్లలు…అదే తండ్రి చేతుల మీదే మృత్యువును ఆలింగనం చేసుకున్నారు… ఆ దృశ్యాలను చూసిన గ్రామస్తుల కళ్లలో కన్నీళ్లు ఆగడం లేదు… మానవత్వం ఇంకా మిగిలే ఉందా? అనే ప్రశ్నను మిగిల్చిన హృదయ విదారక ఘటన నారాయణపేట (Narayanpet) జిల్లాను షాక్‌కు గురిచేసింది. ఈ సంఘటనకు సంబందించిన వివరాలు పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు ఇలా ఉన్నాయి… మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన శివరాములు–భార్య దంపతులకు రిత్విక (ritvika) (8), చైతన్య (Chaitanya) (5) అనే ఇద్దరు చిన్నారులు. ఆడుకుంటూ, నవ్వుతూ, రేపటి భవిష్యత్తు కోసం కలలు కంటున్న ఆ పిల్లలు… తండ్రి చేతిలోనే అకాలంగా ప్రాణాలు కోల్పోయారు.

గతంలో భార్య విడాకులు ఇవ్వడంతో పిల్లలను వెంట పెట్టుకుని శివరాములు జీవనం సాగిస్తున్నాడు. భార్య తిరిగి కాపురానికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనై, జీవితంపై విరక్తి చెందిన అతడు… తన బాధకు కారణం కాని పసిపిల్లలపై కర్కశత్వాన్ని (harshness) చూపించాడు. ఈ సంఘటన గ్రామాన్ని మొత్తం శోకసంద్రంలో ముంచింది.
విశ్వసనీయ సమాచారం మేరకు, ముందుగా శివరాములు (Shivaramulu) తన ఇద్దరు పిల్లలకు క్రిమిసంహారక మందు తాగించినట్లు తెలుస్తోంది. విషం తాగినా ఆ పసిప్రాణాలు వెంటనే విడువకపోవడంతో… చివరికి కోయిల్ సాగర్ కాలువ వద్దకు తీసుకెళ్లి, ఎదురు తిరిగే శక్తి కూడా లేని ఆ చిన్నారులను అత్యంత దారుణంగా కాలువలో తొక్కి చంపినట్లు అనుమానిస్తున్నారు.

ఆ క్షణాల్లో ఆ చిన్నారులు తండ్రిని చూసి ఎంతగా భయపడి ఉంటారో… ఎంతగా కాపాడమని వేడుకుని ఉంటారో… అనే ఆలోచనే మనసును చీల్చేస్తోంది. అనంతరం శివరాములు కూడా అదే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అది ఫలించకపోవడంతో సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ (Transformer) ను తాకి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం కొన్న ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సమాచారం అందుకున్న గ్రామస్తులు పరుగులు పెట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు (police) వెంటనే కోయిల్ సాగర్ కాలువ వద్దకు చేరుకుని, ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన తీలేరు గ్రామాన్ని అస్తవ్యస్తం చేసింది.
పాఠశాల వయసులో ఉన్న పిల్లల మృతదేహాలను చూసి గ్రామస్తులు గుండెలవిసేలా రోదించారు. “ఏ తప్పూ చేయని చిన్నారులపై ఈ కర్కశత్వం ఎలా?” “తండ్రి అనే పదానికి ఇంత దారుణమైన అర్థమా?” అంటూ పలువురు కన్నీటితో ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై మరికల్ ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
