చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన అస్సాం వాసి…
- చిట్యాల మండలం పిట్టంపల్లి సమీపంలో ఘటన
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండల పరిధిలోని పిట్టంపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ కూలీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రం నాగోన్ జిల్లాకు చెందిన చెరబహదూర్ (47) పిట్టంపల్లిలోని శ్రీ పైప్స్ అండ్ ఇన్‌ఫ్రా కంపెనీలో కూలీగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ నెల 14న సాయంత్రం కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెలిమినేడు వెళ్లిన ఆయన, తిరిగి రాత్రి ద్విచక్ర వాహనంపై వస్తుండగా సెవెంటీ కేఎం కంపెనీ సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చెరబహదూర్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆయన మృతి చెందాడు. మృతుడి తమ్ముడు అంబహదూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చిట్యాల ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.
