ఘనంగా వెంకటేశ్వరుడి కళ్యాణ మహోత్సవ వేడుకలు..

వలిగొండ, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన వెంకటాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 8 గంటలకు అంకురార్పణ, హోమం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ధ్వజారోహణం (గరుడ ముద్ర) వైదిక సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు.

వైభవంగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం

సోమవారం రాత్రి శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణలు, సన్నాయి మేళాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించారు.

కళ్యాణోత్సవానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి కొత్తపెళ్లి వెంకటయ్య పట్టు వస్త్రాలు, తలంబ్రాలను కళ్యాణ మండపానికి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం మహా ప్రసాదంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కొత్తపెళ్లి వెంకటయ్య, గ్రామ సర్పంచ్ కర్ణకంటి కలమ్మ–యాదయ్య, మత్స్యగిరి గుట్ట మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం, వివిధ గ్రామాల సర్పంచులు, ధర్మకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.