Indian Rupee Value | రూపాయి క్షీణత వెనుక ఆర్థిక సవాళ్లు
Indian Rupee Value | రూపాయి క్షీణత వెనుక ఆర్థిక సవాళ్లు
Indian Rupee Value | బంగారం నిల్వలు.. దేశ ఆర్థిక రక్షణకు కవచమా?
ఫారెక్స్ నిల్వలపై పెరుగుతున్న ఒత్తిడి
బలమైన రూపాయి కోసం సమష్టి కృషి అవసరం
Indian Rupee Value | ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, డాలర్ బలోపేతం వంటి పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో రూపాయి విలువ క్షీణత, కరెన్సీ నిర్వహణలో ఆర్బిఐ చేపడుతున్న సాంకేతిక మార్పులు, బంగారం నిల్వల వినియోగంపై వస్తున్న వార్తలు దేశ ఆర్థిక భద్రతకు సంబంధించిన కీలక చర్చగా మారాయి.
స్వాతంత్య్రం సమయంలో ఒక అమెరికా డాలర్ విలువ సుమారు రూ.3.30 ఉండగా, ప్రస్తుతం అది రూ.86-87 మధ్యకు చేరింది. గత ఎనిమిది దశాబ్దాల్లో రూపాయి విలువ దాదాపు 25 రెట్లకు పైగా క్షీణించింది. రూపాయి బలహీనత వల్ల చమురు, ఎరువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి దిగుమతుల వ్యయం పెరుగుతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల కుటుంబాలపై కూడా అదనపు ఆర్థిక భారం పడుతుంది. అయితే ఐటీ, ఔషధ, ఎగుమతి రంగాలకు మాత్రం రూపాయి పతనం కొంత ప్రయోజనం చేకూరుస్తుంది.
వాణిజ్య లోటు, కరెంట్ ఖాతా లోటు, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి వంటి అంశాలు రూపాయి విలువను ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఆర్బీఐ తరచూ మార్కెట్లో జోక్యం చేసుకుంటూ రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది.
బంగారం నిల్వలు – ఆర్థిక రక్షణకు కవచం
విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితుల్లో ఆర్బీఐ కొంత బంగారాన్ని విక్రయించి డాలర్ నిల్వలను బలోపేతం చేసిందన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. భారతదేశ ఫారెక్స్ నిల్వలు ఒక దశలో 728 బిలియన్ డాలర్లకు చేరగా, ఇటీవల అవి 681 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ఇదే సమయంలో ఆర్బీఐ వద్ద సుమారు 880 టన్నుల బంగారం నిల్వలున్నాయి. దేశ ఎగుమతుల కంటే దిగుమతుల వ్యయం అధికమవుతున్న నేపథ్యంలో ఫారెక్స్ నిల్వలను కాపాడుకోవడం ప్రభుత్వానికి, ఆర్బీఐకి పెద్ద సవాలుగా మారింది.
రూపాయి బలపడితేనే దేశానికి భవిష్యత్తు?
ఒక అమెరికా డాలర్ విలువ సుమారు రూ.3.30 మాత్రమే ఉండగా, 2026 నాటికి అది రూ.86-87 స్థాయికి చేరుకుంది. అంటే స్వాతంత్య్రం తర్వాత ఎనిమిది దశాబ్దాల కాలంలో రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఇది కేవలం కరెన్సీ విలువ తగ్గుదల మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అంతర్గత, బాహ్య సవాళ్లకు ప్రతిబింబం కూడా.
పెరుగుతున్న దిగుమతులు, చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య లోటు, ప్రపంచ యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ మార్కెట్ల అస్థిరత వంటి అంశాలు రూపాయి బలహీనతకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూపాయి పతనం, ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడి, బంగారం నిల్వల నిర్వహణ, పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు అన్నీ ఒకే ఆర్థిక గొలుసులోని వేర్వేరు కడియాలుగా కనిపిస్తున్నాయి.
అయితే రూపాయి బలోపేతానికి తాత్కాలిక చర్యలు మాత్రమే సరిపోవు. ఎగుమతులు పెంచడం, దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం వంటి దీర్ఘకాలిక విధానాలే శాశ్వత పరిష్కారాలుగా నిలుస్తాయి.
అదే సమయంలో ధరలను అదుపులో ఉంచడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం, ప్రజల కొనుగోలు శక్తిని కాపాడడం కూడా ప్రభుత్వాల ముందున్న ప్రధాన బాధ్యతగా ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, వాతావరణ మార్పులు, చమురు ధరల పెరుగుదల వంటి అనిశ్చిత పరిస్థితుల నడుమ ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సమన్వయంతో, ముందుచూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ప్రజలు కూడా దేశీయ ఉత్పత్తుల వినియోగం, పొదుపు అలవాట్లు, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాలపై మరింత బాధ్యతతో వ్యవహరించాలి. రూపాయి విలువను కాపాడటం అంటే కేవలం ఒక కరెన్సీని రక్షించడం మాత్రమే కాదు. దేశ ఆర్థిక గౌరవాన్ని, అభివృద్ధి సామర్థ్యాన్ని, భవిష్యత్ తరాల ఆర్థిక భద్రతను కాపాడటమే. అందుకే “బలమైన రూపాయి – బలమైన భారతం” అనే లక్ష్యంతో పాలకులు, విధాన నిర్ణేతలు, పరిశ్రమలు, ప్రజలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.
రూపాయికి చికిత్స కేవలం ఆర్బీఐ చేతుల్లోనే లేదు. దేశ ఉత్పాదకత, ఎగుమతులు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల భాగస్వామ్యం కలిసి పనిచేసినప్పుడే రూపాయి మళ్లీ బలపడే అవకాశం ఉంటుంది.
– మేకిరి దామోదర్
సామాజిక విశ్లేషకులు
ఫోన్ : 9573666650
