హైదరాబాద్‌ను ఢిల్లీలా మారనివ్వం: రేవంత్ రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌భ : హైడ్రా (HYDRAA) వ్యవస్థపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వనమహోత్సవం కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ… పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములను ఆక్రమించిన వారిపైనే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. భూ కబ్జాల కారణంగా సామాన్య ప్రజలు నష్టపోకుండా ఉండేందుకే హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించిన‌ట్లు సీఎం స్ప‌ష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం తీవ్ర వాయు కాలుష్య సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, భవిష్యత్తులో హైదరాబాద్ అలాంటి పరిస్థితిని ఎదుర్కోకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నగరంలో పచ్చదనాన్ని పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం కోసం భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించాలని సీఎం పిలుపునిచ్చారు. అభివృద్ధితో పాటు ప్రకృతి సంరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.