గ్రామాల్లో కోతుల హల్చల్.. బయటకు రావాలంటేనే భయం !
- కోతుల దాడులతో బెంబేలెత్తుతున్న గ్రామాలు
- జనావాసాల్లో కోతుల స్వైర విహారం..
ఆంధ్రప్రభ : ఈ మధ్య కాలంలో గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువైంది. ఒకప్పుడు అడవుల్లో మాత్రమే కనిపించే కోతులు.. ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో నిత్య దర్శనమిస్తున్నాయి. చెట్లు తగ్గిపోవడం, అడవుల విస్తీర్ణం క్షీణించడం, ఆహారం కోసం జనావాసాల వైపు రావడం వంటి కారణాలతో కోతుల సమస్య రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. ఉదయం ఇంటి తలుపు తెరిస్తే గుమ్మం దగ్గర కోతులు.. బిల్డింగ్ పై బట్టలు ఆరేస్తే వాటిని చించేయడం.. కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం.. ఇలా ప్రజల జీవనాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
కొన్ని గ్రామాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. గుంపులుగా సంచరించే కోతులు చిన్నపిల్లలు, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. భయంతో పరుగులు తీసే సమయంలో పడిపోవడం, గాయపడటం, కొన్నిచోట్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
సమస్య పరిష్కారం కోసం అటవీ శాఖ, స్థానిక సంస్థలు పలు ప్రాంతాల్లో కోతులను పట్టుకునేందుకు ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేస్తున్నాయి. పట్టుబడిన కోతులను అడవుల్లో విడిచిపెడుతున్నారు. అయితే ఈ చర్యలు శాశ్వత పరిష్కారంగా మారడం లేదు. అడవుల్లో వదిలిన కోతులు కొద్ది రోజులకే మళ్లీ జనావాసాల్లోకి తిరిగి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
అటవీ జీవుల సంరక్షణ చట్టాల కారణంగా కోతుల నియంత్రణలో కూడా పరిమితులు ఉన్నాయి. వాటికి హానిచేయడం చట్టరీత్యా నేరం కావడంతో అధికారులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోంది. దీంతో సమస్యకు శాశ్వత పరిష్కారం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడద ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. అధికారులు తాత్కాలిక చర్యలకే పరిమితం కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
