బీఆర్ఎస్ అబద్ధపు హామీలు.. ఇందిరమ్మ ఇండ్లతో న్యాయం చేస్తున్నాం
- యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ: గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పదేళ్ల పాటు ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేశారని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని రామచంద్రాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ జీవిత బీమా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే సన్న వడ్లు సాగు చేసిన రైతులకు బోనస్‌తో పాటు గృహ అవసరాల కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేస్తున్నామని, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు ద్వారా విద్యారంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ఉచితంగా “యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్” అందిస్తున్నామని తెలిపారు.
