TG | సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సక్సెస్ !

  • దేశ దృష్టిని ఆకర్షించిన కుల గణన స‌ర్వే
  • బీసీ డెడికేటేడ్ కమిషన్‌కు ఈ గణాంకాలు ఉపయోగపడుతాయి

రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024కు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని సీఎం రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుల గణనపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

రాష్ట్రంలో చేపట్టిన ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. సర్వేను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. సర్వేకు సంబంధించి డేటా ఎంట్రీ పూర్తయిందని, ముసాయిదా సిద్ధమైందని అధికారులు వివరించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో ఆరుగురు మంత్రులతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి ఫిబ్రవరి 2వ తేదీలోగా నివేదిక అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటేడ్ కమిషన్‌కు ఈ గణాంకాలు ఉపయోగపడుతాయని అన్నారు.

ఈ కుల గణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కుల గణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పారు.

రాష్ట్రంలో గత ఏడాది నవంబర్ 6వ తేదీన ఈ సర్వే ప్రారంభం కాగా, అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారం నాటికి సర్వే పూర్తయింది. ప్రణాళిక విభాగం అధ్వర్యంలో చేపట్టిన ఈ ఇంటింటి సర్వే మహా యజ్ఞంలో ఎన్యుమరేటర్లు, సూపర్​ వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు దాదాపు లక్ష మందికిపైగా ఉద్యోగులు పాలుపంచుకున్నారు.

ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ధనసరి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply