China | షాంఘైలో భారీ సింక్‌హోల్..

China | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: క్షణాల వ్యవధిలో భారీ రహదారి భూమిలోకి కుంగిపోవడంతో చైనాలోని షాంఘై నగరం ఉలిక్కిపడింది. మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా ఏర్పడిన భారీ సింక్‌హోల్ స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రమాద తీవ్రతను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

షాంఘై నగరంలోని మిన్హాంగ్ జిల్లాలో క్విక్సిన్ రోడ్–లియాన్ రోడ్ కూడలి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భూగర్భంలో నిర్మాణంలో ఉన్న జియామిన్ మెట్రో లైన్ తవ్వకాల సమయంలో నీటి పైపులైన్ దెబ్బతినడంతో నేల అడుగుభాగంలో మట్టి కోతకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఒక్కసారిగా రహదారి కుంగిపడి భారీ గోతిగా మారింది.

అధికారుల వివరాల ప్రకారం సింక్‌హోల్ దాదాపు 30 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతుతో ఏర్పడింది. రహదారిలోని కొంత భాగం, నిర్మాణ సామగ్రి, తాత్కాలిక కంటైనర్లు భూమిలోకి జారిపోయాయి. ఘటన జరిగిన సమయంలో అక్కడ భారీ సంఖ్యలో కార్మికులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ముందస్తు హెచ్చరికలతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని స్థానిక అధికారులు స్పష్టం చేశారు. అయితే భూగర్భ నిర్మాణ పనుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. సింక్‌హోల్ ఏర్పడిన ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి, ఇంజినీర్లు, భూగర్భ నిపుణులు కారణాలను పరిశీలిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో భూగర్భ రవాణా ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటుంటాయి. ముఖ్యంగా భూగర్భ జలాల ప్రవాహం, పైపులైన్ లీకేజీలు, నేల నిర్మాణంలో మార్పులు సింక్‌హోల్‌లకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, కళ్లెదుటే భారీ రహదారి భూమిలోకి కుంగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ‘తృటిలో తప్పిన పెను విపత్తు’గా పలువురు ఈ ఘటనను అభివర్ణిస్తున్నారు.