బొలెరోపై గోడ కూలి ఇద్దరి దుర్మరణం

దేవరకద్ర, ఆంధ్రప్రభ: దేవరకద్రలో బుధవారం సాయంత్రం ఆకస్మికంగా వీచిన ఈదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో నిర్మాణంలో ఉన్న భవనం పైభాగంలోని గోడ కూలి బొలెరో వాహనంపై పడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. భారత్‌మాల రహదారి ప్రాజెక్టుకు సంబంధించిన సిబ్బంది ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని నిర్మాణంలో ఉన్న ఇంటి పక్కన పార్క్ చేసి ఉంచారు. ఈ క్రమంలో బలమైన గాలులకు రెండు అంతస్తుల ఎత్తులో ఉన్న గోడ ఒక్కసారిగా కూలి వాహనంపై పడింది. దీంతో వాహనం పూర్తిగా ధ్వంసమై, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు.

సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించి వారిని బయటకు తీసి అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో ఇద్దరూ మృతి చెందారు. మృతులను చిత్తూరు జిల్లాకు చెందిన జగన్నాథ్ రెడ్డి (40), అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తిగా, అలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంతోష్ (42), డ్రైవర్‌గా గుర్తించారు. ఈ విషాద ఘటనతో దేవరకద్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.