ప్రతి మొక్కజొన్న గింజా కొనుగోలు చేయాలి

ప్రతి మొక్కజొన్న గింజా కొనుగోలు చేయాలి
- నాగం శశిధర్ రెడ్డి డిమాండ్
నాగర్‌కర్నూల్,ఆంధ్రప్రభ : రైతులు పండించిన మొక్కజొన్న పంటను చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన ఆయన, అక్కడ వేచి ఉన్న రైతుల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నాగం శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. గత 20 రోజులుగా మార్కెట్ యార్డులో రైతులు మొక్కజొన్న విక్రయం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు సగటున 40 నుండి 45 క్వింటాళ్ల దిగుబడి వస్తుంటే, ప్రభుత్వం కేవలం 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధనలు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ఇలాంటి అర్థం లేని నిబంధనలను వెంటనే తొలగించి, రైతు పేరు మీద ఉన్న పూర్తి పంటను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మార్కెట్ యార్డులో ఎదురవుతున్న గన్ని బ్యాగుల (సంచుల) కొరతపై ఆయన మార్క్‌ఫెడ్ డిఎం (DM) తో ఫోన్లో మాట్లాడారు. వచ్చే రెండు రోజుల్లో మార్కెట్‌లో ఉన్న నిల్వలను, సంచులను పూర్తిస్థాయిలో క్లియర్ చేయాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. రైతులకు అండగా ఉండి వారి సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సీనియర్ నాయకులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
