వెలిమినేడు వద్ద ప్రమాదం.. యువకుడి ప్రాణాలు బలి
వెలిమినేడు వద్ద ప్రమాదం.. యువకుడి ప్రాణాలు బలి
మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఎలుగు యాదయ్య, పార్వతమ్మ దంపతుల కుమారుడు ఎలుగు సందీప్ (22) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సందీప్ హైదరాబాద్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. బుధవారం ఉదయం తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో విజయవాడకు బయలుదేరాడు. చౌటుప్పల్ దాటిన అనంతరం చిట్యాల మండలం వెలిమినేడు సమీపానికి చేరుకున్న సమయంలో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారు రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అందులోనే చిక్కుకుపోయారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక సీటులో కూర్చున్న సందీప్‌కు తీవ్ర గాయాలు కావడంతో పాటు పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. సందీప్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
గత రెండేళ్ల క్రితమే కుమార్తె మృతి చెందగా, ఇప్పుడు ఉన్న ఒక్క కుమారుడు కూడా ప్రమాదంలో మృతి చెందడంతో యాదయ్య, పార్వతమ్మ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. వరుస విషాదాలు ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేశాయి. యువకుడి మృతి వార్త తెలిసిన వెంటనే దత్తప్పగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
