రూ.110 కోట్ల రుణానికి రెండున్నరేళ్లలో ముగింపు..

రూ.110 కోట్ల రుణానికి రెండున్నరేళ్లలో ముగింపు..

కృష్ణా మిల్క్ యూనియన్ చారిత్రాత్మక ఘనత..
వీరవల్లి కామధేను ప్లాంట్‌తో పాల రంగంలో కొత్త అధ్యాయం..
వైట్ రివల్యూషన్ 2.0 సదస్సులో విజయోత్సవ వేడుకలు..
పాడి రైతుల సహకారంతో ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం..
టర్నోవర్, నికర ఆస్తుల్లో రికార్డు స్థాయి వృద్ధి

చిట్టీనగర్, ఆంధ్రప్రభ : పాల ఉత్పత్తిదారుల చిరకాల స్వప్నంగా భావించిన వీరవల్లి ప్రాజెక్ట్ కామధేను ప్లాంట్ విజయవంతంగా అమలై, దాని నిర్మాణం కోసం తీసుకున్న రూ.110 కోట్ల బ్యాంకు రుణాన్ని కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే పూర్తిగా తీర్చడం ద్వారా కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో అరుదైన మైలురాయిని నమోదు చేసింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన “వైట్ రివల్యూషన్ 2.0” ప్రాంతీయ వర్క్‌షాప్ సందర్భంగా విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ, వీరవల్లి గ్రామంలో రోజుకు 6 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యంతో, భవిష్యత్తులో 8 లక్షల లీటర్లకు విస్తరించే వీలున్న అత్యాధునిక పూర్తి ఆటోమేటెడ్ కామధేను ప్లాంట్‌ను రూ.185 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి, కేవలం రూ.163 కోట్ల వ్యయంతో పూర్తి చేయడం సంస్థకు గర్వకారణమని తెలిపారు. ఈ ప్లాంట్‌కు మాక్స్ చట్ట రూపకర్త, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరు పెట్టి రైతాంగానికి, భావితరాలకు అంకితం చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు కోసం రూ.110 కోట్ల రుణాన్ని ఏడు సంవత్సరాల గడువుతో తీసుకున్నప్పటికీ, సమర్థవంతమైన నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణ, పాడి రైతుల అచంచల సహకారంతో రెండున్నర సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో చెల్లించడం సహకార రంగంలో అరుదైన విజయమని చెప్పారు. బుడమేరు వరదల కారణంగా విజయవాడ ఫ్యాక్టరీ 42 రోజుల పాటు మూతపడటంతో రూ.24 కోట్ల నష్టం వాటిల్లినా, ముందుచూపుతో నిర్మించిన కామధేను ప్లాంట్ ద్వారా మొత్తం ప్రాసెసింగ్ నిర్వహించి వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసినట్లు వివరించారు.

ఏడేళ్లలో విశేష ప్రగతి…

గత ఏడు సంవత్సరాల్లో కృష్ణా మిల్క్ యూనియన్ సాధించిన అభివృద్ధిని వివరిస్తూ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు పలు గణాంకాలను వెల్లడించారు. పాల సేకరణ ధరను కేజీ ఫ్యాట్‌కు రూ.280 మేర పెంచి ప్రస్తుతం రూ.850కు చేర్చినట్లు తెలిపారు. పాల సేకరణ 71 శాతం పెరిగి 10.33 కోట్ల లీటర్లకు చేరుకోగా, గత ఐదేళ్లలో ధర వ్యత్యాసం (బోనస్) రూపంలో రైతులకు రూ.250 కోట్లకు పైగా చెల్లించామని చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే రూ.45 కోట్ల బోనస్ రైతులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. యూనియన్ వార్షిక టర్నోవర్ 78 శాతం వృద్ధితో రూ.1,273 కోట్లకు చేరుకోగా, నికర ఆస్తుల విలువ రూ.95 కోట్ల నుంచి రూ.256 కోట్లకు పెరిగి 168 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు వెల్లడించారు. పాడి రైతుల సంక్షేమం కోసం ప్రతి లీటర్ పాలపై రూ.2కుపైగా ఖర్చు చేస్తున్నామని, వినియోగదారుల నుంచి వచ్చే ప్రతి రూపాయిలో సుమారు 85 శాతం మొత్తాన్ని రైతులకే అందజేస్తున్న దేశంలోనే అరుదైన సహకార పాల సంస్థగా కృష్ణా మిల్క్ యూనియన్ నిలిచిందని పేర్కొన్నారు.

జాతీయ స్థాయి ప్రతినిధుల సమక్షంలో సంబరాలు…

వైట్ రివల్యూషన్ 2.0 ప్రాంతీయ వర్క్‌షాప్‌లో కేంద్ర పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్ దయానంద్ సావంత్, తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ యాదవ్, ఐఏఎస్, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) దక్షిణ ప్రాంతీయ అధిపతి రోమీ జాకబ్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల సహకార డెయిరీల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు పాల్గొన్నారు. వారి సమక్షంలో కేక్ కట్ చేసి రూ.110 కోట్ల రుణాన్ని పూర్తిగా తీర్చిన విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, మేనేజింగ్ డైరెక్టర్, పాలకవర్గ సభ్యులను పలువురు ప్రముఖులు అభినందించి పూలమాలలతో సత్కరించారు. పాడి రైతులు, పాల సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, అధికారులు, ఉద్యోగుల సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని ఛైర్మన్ ప్రత్యేకంగా ప్రశంసించారు.