టీడీపీ ఆవిర్భావానికి 44 ఏళ్లు

టీడీపీ ఆవిర్భావానికి 44 ఏళ్లు

  • విజయవాడలో ఘనంగా వేడుకలు
  • ఎంపీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు..
  • ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు…
  • పార్టీ పతాక ఆవిష్కరణతో ఉత్సవ శోభ

ఆంధ్రప్రభ, విజయవాడ ; విజయవాడలోని ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. గురు నానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.

పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ ఆదేశాలతో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ స్థాపనతో తెలుగు జాతి ఖ్యాతి విశ్వవ్యాప్తం అయిందన్నారు. ఎన్టీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశ రాజకీయాల్లో కొత్త దిశను నిర్దేశించాయని కొనియాడారు.

మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం వంటి సంస్కరణలు ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. 1985–89 కాలంలో లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన ఏకైక ప్రాంతీయ పార్టీగా టిడిపి గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి దేశంలో సంకీర్ణ రాజకీయాలకు బీజం వేసిన నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ విప్లవం, విద్యుత్ రంగ సంస్కరణల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు.

యువనేత నారా లోకేష్ “కార్యకర్తే అధినేత” సిద్ధాంతంతో కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఉడా మాజీ చైర్మన్ తూమాటి ప్రేమనాథ్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ ఆశయాల సాధనలో చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్రానికి చక్కటి భవిష్యత్తును అందిస్తోందన్నారు. టిడిపి రాష్ట్ర నాయకుడు చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సాధన చంద్రబాబు పాలనలోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బొర్రా రాధాకృష్ణ, గొట్టుముక్కల రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులకు, ప్రజలకు మిఠాయిలు పంచి ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహించారు.

Leave a Reply