ఎర్రకుంట పూడికతీతలో ‘మట్టి’ దందా..!

ఎర్రకుంట పూడికతీతలో ‘మట్టి’ దందా..!

  • -రూ.23 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో పనులు..
  • -మట్టితో లక్షల సంపాదన ఆరోపణలు
  • -అధికార పార్టీ నేత అండతో నిబంధనలకు తూట్లు?
  • -గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ:
ప్రభుత్వ నిధులు.. ప్రజా అవసరాలు.. కానీ లాభాలు మాత్రం కాంట్రాక్టర్‌వి! బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రకుంట చెరువు పూడికతీత పనులు సదరు గుత్తేదారుకు అడ్డగోలు సంపాదనకు మార్గంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.23 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన ఈ పనుల్లో నిబంధనలను పక్కనబెట్టి విలువైన మట్టిని ప్రైవేట్ వెంచర్లు, కమర్షియల్ అవసరాలకు తరలిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రైతులకు దక్కని మట్టి.. ప్రశ్నిస్తే బెదిరింపులా?

నిబంధనల ప్రకారం చెరువు పూడికతీత ద్వారా వెలికితీసిన మట్టిని స్థానిక ఆయకట్టు రైతుల పొలాలకు ఉచితంగా తరలించాలి. లేకపోతే మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రభుత్వ అవసరాలకు లేదా నిరుపేదల ఇందిరమ్మ ఇళ్ల బేస్‌మెంట్‌ల కోసం వినియోగించాలి. అయితే గుత్తేదారు ఈ నిబంధనలను పట్టించుకోకుండా రాత్రింబవళ్లు వందలాది లారీలతో మట్టిని విక్రయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

నిబంధనలు పాటించాలని సూచించిన ఇరిగేషన్ డీఈని సైతం గుత్తేదారు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. “అంతా నా ఇష్టం.. నువ్వేం చేసుకుంటావో చేసుకో” అంటూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

తూము, మత్తడి నిర్మాణం కూడా చేయాలి

మంద అనిత, కన్నాల మాజీ సర్పంచ్ మాట్లాడుతూ.. ఎర్రకుంట చెరువు పూడికతీత పనులకు రూ.23 లక్షలు కేటాయించినందున కేవలం మట్టి తీయడమే కాకుండా తూము, మత్తడి నిర్మాణంతో పాటు చెరువు కట్టను కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ మనోజ్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

మెజర్‌మెంట్ చేసి బిల్లుల్లో కోత విధిస్తాం

నరేన్ కుమార్, ఇరిగేషన్ డీఈ, బెల్లంపల్లి మాట్లాడుతూ… ఎర్రకుంట చెరువు పనుల్లో గుత్తేదారు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. క్షేత్రస్థాయిలో కొలతలు తీసి ఎంత మట్టి తరలించారో నిర్ధారిస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే గుత్తేదారుకు చెల్లించాల్సిన ఫైనల్ బిల్లుల నుంచి రికవరీ కింద డబ్బులు కోత విధిస్తామని, ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామని స్పష్టం చేశారు.