ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న ‘యోగాంధ్ర’ వేడుకలు
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న ‘యోగాంధ్ర’ వేడుకలు
విజయవంతంగా 11వ రోజు కార్యక్రమం పూర్తి.
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర’ ప్రత్యేక శిక్షణ, అవగాహన కార్యక్రమం నేటితో విజయవంతంగా 11వ రోజుకు చేరుకుంది. భక్తులు, ఆలయ సిబ్బంది మరియు స్థానిక యోగా సాధకులలో ఆరోగ్య చైతన్యాన్ని నింపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ ఉదయం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహిస్తున్నారు. 11వ రోజు కార్యక్రమంలో భాగంగా నడుము నొప్పి, కీళ్ల నొప్పుల నివారణకు ఉపయోగపడే ప్రత్యేక యోగాసనాలతో పాటు… మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతను పెంపొందించే ‘ప్రాణాయామం’, ‘ధ్యానం’ (మెడిటేషన్) లపై యోగా నిపుణులు క్షేత్రస్థాయిలో సాధకులకు రాజ గోపురం ముందు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఏ విధంగా దోహదపడుతుందో ఈ సందర్భంగా నిపుణులు వివరించారు. ముఖ్యంగా నిత్యం విధుల్లో బిజీగా ఉండే ఆలయ అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో సూచించారు రోజురోజుకూ ఈ ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి ఆదరణ పెరుగుతోంది.
ఇటు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు, అటు దేవస్థాన సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉచితంగా యోగాసనాలను నేర్చుకుంటున్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యోగా ఒక ముఖ్య భాగమని, ఈ యోగాంధ్ర శిబిరాన్ని భక్తులు, సిబ్బంది మరింతగా సద్వినియోగం చేసుకోవాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ కోరారు.
