ఉపాధి హామీ పథకంపై ఆందోళన..
ఉపాధి హామీ పథకంపై ఆందోళన..
కూలీలకు అండగా వ్యవసాయ కార్మిక సంఘం
గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించి రాంజీ స్కీమ్‌ను రద్దు చేయాలి: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం
కొత్తచెరువు, ఆంధ్రప్రభ : గ్రామీణ పేదల జీవనాధారంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకొని రాంజీ స్కీమ్‌ను రద్దు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలో బుధవారం ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతాలను ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి. కదిరప్ప, జిల్లా గౌరవ అధ్యక్షుడు కుల్లాయప్ప సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేని సమయంలో లక్షలాది మంది పేదలకు ఉపాధి హామీ పథకం జీవనాధారంగా నిలుస్తోందన్నారు. ఇలాంటి పథకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కొరత సృష్టించడం వల్ల కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీల వేతనాలు లేవని, కనీసం రోజుకు రూ.800 వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనేక వారాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధి కూలీల బిల్లులను వెంటనే విడుదల చేసి వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, కూలీలకు సంవత్సరానికి మరిన్ని పనిదినాలు కల్పించాలని కోరారు. పనిస్థలాల్లో త్రాగునీరు, టెంట్లు, ప్రథమ చికిత్స మందులు, మెడికల్ కిట్లు, పనిముట్లు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వేసవి కాలంలో తీవ్ర ఎండల కారణంగా కూలీలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామీణ పేదల జీవన భద్రత కోసం ఉపాధి హామీ పథకానికి మరింత నిధులు కేటాయించి బలోపేతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు భాస్కర్ రెడ్డి, రాములు, ఆంజనేయులు, ఉపాధి కూలీలు శంకర్ రెడ్డి, శ్రీరాములు, కుల్లాయప్ప, చిన్న కృష్ణమ్మ, వాణి, పద్మావతి, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
