ధర్మవరం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

  • రూ.36.21 కోట్ల అమృత్ 2.0 పనులకు మంత్రి సత్యకుమార్ శంకుస్థాపన

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: ధర్మవరం పట్టణ ప్రజల దశాబ్దాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమృత్ 2.0 పథకం కింద రూ.36.21 కోట్లతో చేపట్టనున్న తాగునీటి అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ గురువారం శంకుస్థాపన చేశారు. పట్టణంలోని రామ్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో తీసుకొచ్చిన నిధులను ప్రజలకే అంకితం చేస్తున్నామని అన్నారు. ధర్మవరం పట్టణంలో ప్రస్తుతం నాలుగు రోజులకోసారి లేదా వారానికి ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని, ఈ పరిస్థితిని మార్చి ప్రతిరోజూ ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీరు అందించడమే లక్ష్యమని తెలిపారు. మాటలు కాకుండా మౌలిక వసతుల అభివృద్ధినే తమ రాజకీయానికి ప్రమాణంగా తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

అమృత్ 2.0 ప్రాజెక్టులో భాగంగా ధర్మవరం మున్సిపాలిటీని మూడు జోన్లుగా విభజించి, ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పానుపల్లి ఇంటేక్ వెల్ వద్ద నిమిషానికి 17,460 లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు కొత్త పంపులు, తమ్మాపురం రా వాటర్ సంప్ వద్ద మరో రెండు పంపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 25 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు అదనంగా 10 ఎంఎల్‌డీ సామర్థ్యం గల కొత్త ప్లాంట్ నిర్మించనున్నట్లు వెల్లడించారు.

అలాగే రామ్‌నగర్, శాంతినగర్, గిరిరాజ్ కాలనీల్లో ఒక్కొక్కటి వెయ్యి కిలోలీటర్ల సామర్థ్యంతో మూడు కొత్త ఈఎల్‌ఎస్‌ఆర్ ట్యాంకులు నిర్మించడంతో పాటు సుమారు 35.73 కిలోమీటర్ల పాత పైప్‌లైన్లను తొలగించి కొత్త పైప్‌లైన్లు వేయనున్నట్లు మంత్రి వివరించారు. పాత పైపుల కారణంగా నీటి నాణ్యత దెబ్బతింటోందని, కొత్త వ్యవస్థతో మెరుగైన సరఫరా సాధ్యమవుతుందని అన్నారు.

తాగునీటి సమస్యతో పాటు విద్యుత్ సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.110 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. మొదటి విడతగా రూ.4.60 కోట్లు మంజూరై టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. పట్టణంలో ఇప్పటికే 500కు పైగా విద్యుత్ స్తంభాల మార్పు పనులు జరుగుతున్నాయని తెలిపారు.

అధికారికంగా పనుల గడువు 18 నెలలు ఉన్నప్పటికీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 12 నుంచి 15 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సంస్థను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, ఈఈ సాయికృష్ణ, జెడబ్ల్యుఐఎల్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ ప్రతినిధులు, బీజేపీ నాయకులు, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.