india vs afghan| భారత్‌-ఏ బ్యాటర్ల బాదుడు..

india vs afghan| భారత్‌-ఏ బ్యాటర్ల బాదుడు..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌-ఏ జట్టు కీలక మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదు చేసింది. ఫైనల్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌-ఏపై భారత్‌-ఏ బ్యాటర్లు మెరుపులు మెరిపించారు. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు.

టాస్‌ గెలిచిన అఫ్గానిస్థాన్‌-ఏ కెప్టెన్‌ ముందుగా బౌలింగ్‌ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన భారత్‌-ఏకు ఓపెనర్లు ప్రియాంశ్‌ ఆర్య, వైభవ్‌ సూర్యవంశీ శుభారంభం అందించారు. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ అఫ్గాన్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ప్రియాంశ్‌ ఆర్య అర్ధశతకంతో ఆకట్టుకుని 58 పరుగులు చేయగా, వైభవ్‌ సూర్యవంశీ 28 బంతుల్లో 38 పరుగులు చేసి వేగవంతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మంచి ఆరంభం చేసినప్పటికీ దాన్ని భారీ స్కోరుగా మలచలేక 30 పరుగుల వద్ద వెనుదిరిగాడు. అయితే మధ్య ఓవర్లలో తిలక్‌ వర్మ, కుమార్‌ కుశాగ్ర బాధ్యతాయుతంగా ఆడి జట్టును బలమైన స్థితికి చేర్చారు. ఇద్దరూ అర్ధశతకాలతో రాణించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

చివరి ఓవర్లలో బ్యాటర్లు వేగం పెంచడంతో భారత్‌-ఏ 300 పరుగుల మార్కును దాటింది. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫైనల్‌ రేసులో నిలవాలంటే అఫ్గానిస్థాన్‌-ఏ ఈ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.