హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు.. రాజకీయ దుమారం!
హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు.. రాజకీయ దుమారం!
అమర్నాథ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
పుట్టపర్తి, ఆంధ్రప్రభ : రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయమని కాదని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని రాష్ట్ర మహిళలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన గౌరవప్రదమైన పదవిలో ఉన్న రాష్ట్ర మహిళా హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు. మహిళల గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ఏ పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరని, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వెంటనే స్పందించి గుడివాడ అమర్నాథ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ విభేదాలు ఉంటే విధానాలపై చర్చించాలే గానీ, వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు.
ఉపాధ్యాయురాలిగా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన అనిత, ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా మహిళల పక్షాన సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. రాజకీయాల్లో ఆమె అనేక సంవత్సరాలుగా ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు.
కొంతమంది నేతల వ్యాఖ్యల వల్ల రాజకీయాల్లో హుందాతనం, నైతిక విలువలు దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో గౌరవంగా జీవిస్తున్న మహిళల మనోభావాలను దెబ్బతీస్తాయని, ఏ రాజకీయ పార్టీ కూడా వాటిని ఉపేక్షించకూడదన్నారు.
అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి వ్యాఖ్యలు మహిళలు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని దెబ్బతీసే ప్రమాదం ఉందని తెలిపారు.
