రాయలసీమ అభివృద్ధికి కీలకం రక్షణ రంగ పరిశ్రమలు

రాయలసీమ అభివృద్ధికి కీలకం రక్షణ రంగ పరిశ్రమలు
– బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపీ సీనియర్ నేత ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రక్షణ శాఖ మంత్రిని ఆయన ఆత్మీయంగా ఆహ్వానించి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా రాయలసీమలో ప్రారంభమైన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టు దేశ రక్షణ రంగ చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. AMCA ప్రాజెక్టు శంకుస్థాపనతో పాటు రక్షణ, వైమానిక రంగం, డ్రోన్ సాంకేతిక వ్యవస్థలకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల ప్రారంభం భారత్‌ను స్వయం సమృద్ధి రక్షణ తయారీ దిశగా మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
దేశీయ సాంకేతికతతో ఆధునిక యుద్ధ విమానాల తయారీకి ఇది బలమైన పునాది అవుతుందని, “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్య సాధనలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భవిష్యత్ వైమానిక ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
రాయలసీమ ప్రాంత అభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెరుగుదలకు, పరిశ్రమల విస్తరణకు ఈ కొత్త రక్షణ ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని విష్ణువర్ధన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
