17thJunechintana | మానవ జన్మ సార్థకతకు దైవచింతనే మార్గదర్శి
17thJunechintana | మానవ జన్మ సార్థకతకు దైవచింతనే మార్గదర్శి
17thJunechintana | మానవ జన్మ విశిష్టత, భగవంతుని కృప ప్రాముఖ్యత
దేహబుద్ధి, ఆత్మబుద్ధి, జీవబుద్ధి మధ్య తేడా
పరమాత్మ సేవతో మోక్షప్రాప్తి, సద్గుణాల వికాసం
17thJunechintana | సృష్టిలోని జీవరాశులన్నింటిలో మానవ జన్మ చాలా ఉన్నతమైనది. ఎందుకంటే మిగిలిన జీవుల కంటే మానవులకు ఆలోచనా శక్తి, బుద్ధి కుశలత, వివేకం, విచక్షణా జ్ఞానం ఉంటాయి. మిగిలిన జీవులకు ఇవేమీ ఉండవు. ముఖ్యంగా భావ వ్యక్తీకరణ మనుష్యులకు ఉంది. జీవితం సార్థకం చేసుకోవడానికి భగవంతుడు ఎన్నో మార్గాలను అందించాడు. ఆఖరికి భగవద్గీతలో కూడా తొమ్మిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు, ఎవరైతే తనను గురించి చింతిస్తూ, ధ్యానిస్తూ, నిష్ఠ, శుచి, తత్త్వంతో ఉంటారో వారి యోగక్షేమాల బాధ్యత తానే వహిస్తానని గొప్ప భరోసా ఇచ్చారు. అలా భగవంతుని కృప పొందిన వారిలో త్యాగయ్య, తులసీదాసు, వల్లభాచార్యులు వంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. భగవంతుని చింతన కలిగి ఉండడమే, ఆయన నామాన్ని పఠించడమే ఈ కలియుగంలో భగవంతుని కృపకు తొలి మెట్టు.
శంకరాచార్యులు తాను రచించిన వివేకచూడామణి మూడవ శ్లోకంలో “లబ్ధ్వా కథంచిన్నర జన్మ దుర్లభం యస్స్వాత్మ ముక్త్వా న యతేత స మూఢధీః” అని చెప్పారు. అంటే మోక్ష సాధన మానవుల చేతుల్లోనే ఉందని అర్థం. దుర్భరమైన ఈ సంసారంలో చిక్కుకోకుండా, తామరాకు మీద నీటి బొట్టులా ఉండి భగవంతుని చింతన చేయరా మూఢుడా అని హెచ్చరించారు. అంటే మన ప్రయత్నం లేనప్పుడేదీ పొందలేము. ఒకటి పొందాలంటే ఇచ్చేవాడు ఒకడు ఉండాలి కదా. ఆయన్నే ఆశ్రయిస్తేనే పొందగలం. ఇది మన అనుభవంలో ఉన్న విషయమే.
అలాగే, అనేక సమస్యలతో బాధపడే వారు తెలిసీ తెలియని స్థితిలో దుష్కర్మలు చేస్తూ ఈ జనన మరణ చక్రంలో బందీలు కాకుండా మోక్షం పొందాలంటే భగవంతుని ఆశ్రయించవలసిందే. మోక్షాన్ని ప్రసాదించేవాడు ఆయనే. మనం మనసు చెప్పినట్లుగా ప్రవర్తిస్తుంటాము. చంచలమైన మనసుకు కోరికలు, తృష్ణ, వ్యామోహం ఎక్కువ. అనవసర విషయాసక్తి కూడా ఎక్కువ. మనసును నియంత్రించేది బుద్ధి. మనం మంచి చేసినా, చెడు చేసినా మనసే కారకం. అందుకే ఒక్కో సందర్భంలో “బుద్ధి లేదా?” అని తిడుతూ ఉంటారు. బుద్ధిని కూడా నియంత్రించాలి. లేకపోతే “బుద్ధి నాశాత్ ప్రణశ్యతి” అన్నట్లుగా బుద్ధి హీనమైతే మానవ పతనానికి నాంది పలికినట్టే.
బుద్ధి కూడా మూడు రకాలుగా ఉంటుంది.
- దేహబుద్ధి
- ఆత్మబుద్ధి
- జీవబుద్ధి
దేహబుద్ధిలో చూసిన సందర్భంలో వ్యామోహానికి గురికావడం, మనసు ప్రేరణ పొంది కావాలని కోరుకోవడం వంటివి జరుగుతాయి.
ఆత్మబుద్ధి అంటే వివేకంతో, విచక్షణతో ఆలోచించడం. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు తన బంధువులను చూడగానే దేహబుద్ధికి లోనయ్యాడు. శ్రీకృష్ణ పరమాత్మ బోధించగానే ఆత్మబుద్ధి మేల్కొంది. జీవబుద్ధి అంటే దేహబుద్ధిలాగే ఉంటుంది. కాకపోతే జీవబుద్ధి వల్ల బుద్ధికి ఏర్పడిన ఆలోచన చాలా కాలం వరకు జీవుడిని అంటిపెట్టుకుని ఉంటుంది. అందుకే మనం భగవంతుని సేవలో నిమగ్నమై, బుద్ధిని ఆత్మబుద్ధిగా, అక్కడి నుంచి జీవబుద్ధిగా నిలకడ సాధించేటట్లు సాధన చేయాలి. ఇందుకు ఎంతో తపన ఉండాలి.
సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం, నిశ్చలమైన మనస్సుతో భగవంతుని స్మరణ చేస్తూ ఉంటే సంసారిక భవబంధాల నుంచి బయటపడగలము. చాలా మంది తూతూ మంత్రంగా చేస్తున్నామని భావిస్తుంటారు. గుడికి వెళ్లి అర్చనలు, అభిషేకాలు చేయించినా కేవలం దేహబుద్ధి కోసం మాత్రమే చేస్తే వాటివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఆత్మబుద్ధితో దైవాన్ని పొందాలి.
ఆది శంకరాచార్యులు తన భజగోవిందం మొదటి శ్లోకంలోనే “ఓ మానవుడా! బుద్ధిహీనుడా! గోవిందుడినే ఆశ్రయించు. అంత్యకాల సమయంలో సంసారపు ఆలోచనలు నిన్ను రక్షింపవు సుమా!” అని చెప్పారు. చాలా మంది భగవంతుని సేవకు కూడా వానప్రస్థం వచ్చే వరకు వేచి ఉండాలనే భ్రమలో కాలాన్ని వృథా చేస్తున్నారని కూడా పేర్కొన్నారు.
పరమాత్మ సేవకు ఒక నియమం, ఒక వేళ అంటూ ఏమీ ఉండవు. నిన్ను వెన్నంటి ఉండేవి నీ కర్మలే. సత్కర్మలు చేస్తూ ఉంటే స్వర్గం, దుష్కర్మలు చేస్తూ ఉంటే నరకం చూపిస్తాడు పరమాత్మ. అందుకే పరమాత్మ సేవలో ఉంటే వివేకం, ఆలోచనాపటిమ, సత్కర్మలు, ధర్మంగా జీవించడం వంటి సద్గుణాలు అలవడి, చివరకు మోక్షప్రాప్తి కలుగుతుంది.
– అనంతాత్మకుల రంగారావు
