ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అప్రమత్తంగా ఉండాలి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అప్రమత్తంగా ఉండాలి
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి అప్రమత్తంగా వ్యవహరించాలని మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపునిచ్చారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని బూత్ నంబర్-262 పరిధిలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన కూటమి శ్రేణులకు ఎస్.ఐ.ఆర్ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం నమోదు చేయబడిన ఓట్లను సుమారు 20 నుంచి 25 సంవత్సరాలకు ఒకసారి సమగ్రంగా, అత్యంత సూక్ష్మంగా పరిశీలించే ప్రక్రియనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని వివరించారు.
సాధారణ ఎన్నికల సమయంలో కొత్త ఓటర్లను చేర్చడం, మరణించిన లేదా అర్హత కోల్పోయిన వారి పేర్లను తొలగించడం వంటి ప్రక్రియలు కొనసాగుతుంటాయని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా చేపడుతున్న ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం మాత్రం ప్రత్యేకమైనదని తెలిపారు. ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా ఈ సమగ్ర సవరణ ఉపయోగపడుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఓటర్ల నమోదు, సవరణలకు సంబంధించిన అంశాలపై ప్రజలకు సహకారం అందించాలని సూచించారు. ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన సదస్సులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు , కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు, బూత్ స్థాయి ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
