ఎండల తీవ్రతతో ఏలూరు జిల్లా అలర్ట్…
ఎండల తీవ్రతతో ఏలూరు జిల్లా అలర్ట్…
45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల హెచ్చరిక
జిల్లా కలెక్టర్ అప్రమత్త చర్యలకు ఆదేశం
ఏలూరు బ్యూరో ఆంధ్ర ప్రభ : ఏలూరు జిల్లాలో రానున్న ఐదు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, తీవ్రమైన ఎండలు, వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రద్దీ ప్రదేశాల్లో మంచినీటి సౌకర్యం, శీతలీకరణ షెల్టర్లు, నీడ వంటి ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వేడిగాలులకు గురైన వారికి వెంటనే చికిత్స అందించే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది, అవసరమైన ఔషధాలను సిద్ధంగా ఉంచాలని వైద్య సిబ్బందిని సూచించారు.
