స్పెషల్‌ ఇంటెన్సీవ్‌ రివిజన్‌ కు సహకరించాలి

స్పెషల్‌ ఇంటెన్సీవ్‌ రివిజన్‌ కు సహకరించాలి

ఓటరు జాబితా సవరణ సాధారణ ప్రక్రియే
తూర్పులో సర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి ఓటరు జాబితాలో పేర్లు పరిశీలించిన
ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె అనురాధ

పటమట, ఆంధ్రప్రభ : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్క ఓటరు బాధ్యతని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనరాధ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సర్ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పూర్తిగా అధికారులకు సహకరించాలని సూచించారు. పటమట అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ఇంటి దగ్గర స్పెషల్‌ ఇంటెన్సీవ్‌ రివిజన్‌ (సర్‌) కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌తో పాటుగా గద్దె అనురాధ పాల్గొని ఒటరు జాబితలో తన పేరును పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు. మరణించినవారు, మరో ప్రాంతానికి వెళ్ళిన వారి పేర్లు సైతం ఇప్పటికి ఓటరు జాబితాలో ఉన్నాయని, వాటిని తొలగించాలన్నారు. సరైన విధానంలో సక్రమంగా అందుబాటులో లేని వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టిందన్నారు.

ఓటింగ్‌ శాతం 60 శాతం మాత్రమే పోల్‌ అవుతుందంటే అందుకు కారణం ఓటరు జాబితా సక్రమంగా లేకపోవడమే కారణమని చెప్పారు. ఓటరు జాబితాను పూర్తి స్థాయిలో అప్‌డేట్‌ చేయడం ద్వారా వందకు వంద శాతం పోలింగ్‌ జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటరు జాబితాను సవరించడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ అని చెప్పారు. ఇంటికి వచ్చే బిఎల్‌వోలకు పూర్తిగా సహకరించి, వివరాలను తెలియజేయాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కోరారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా దేశంలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉందన్నారు. సర్‌ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఓటు హక్కు పొందడం అనేది బాధ్యతగా స్వీకరించాలన్నారు.

సర్‌ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 18 సంవత్సరాలు పూర్తి అయిన వారు ఓటరుగా జాయిన్‌ చేసుకోవడంతో పాటుగా మరణించిన వారి పేర్లు తొలగించేందుకు సమాచారం, సహకారం అందించాల్సిందిగా గద్దె అనురాధ కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు పవన్‌కుమార్, అబ్దుల్ కమీర్, పార్టీ నాయకులు షేక్ అబ్దుల్ కరీమ్, ముమ్మనేని ప్రసాద్, వెనిగళ్ళ వెంకట శివప్రసాద్, మహమ్మద్ ఖాలిక్, శాయన బుజ్జి, మహమ్మద్‌ రిజ్వాన్, మేదరమెట్ల నారాయణ, కోడె సాంబశివరావు, బొర్రా బాలు, లియాకత్‌ ఆలీ, పఠాన్‌ బాజీ తదితరులు పాల్గొన్నారు.